MANAAPMS

Tuesday, June 18, 2013

ప్రారంభంపై అనిశ్చితి

 ప్రారంభంపై అనిశ్చితి 
హైదరాబాద్‌: వేసవి సెలవుల అనంతరం పాఠశాలల్లో విద్యార్థుల కోలాహలం మళ్లీ కనిపించింది. కానీ ఆదర్శ పాఠశాలల విషయంలో మాత్రం ఇంకా అయోమయమే నెలకొంది. ఈ పాఠశాలల్లో ఈసారి 6, 7, 8, 11 తరగతులను ప్రారంభిస్తున్నారు. వీటిల్లో ప్రవేశాల కోసం రాష్ట్
ర వ్యాప్తంగా లక్షన్నర వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తొలివిడతలో 355 పాఠశాలలను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. స్థలసేకరణ తదితర సమస్యల కారణంగా ఈ సంఖ్య 310కే పరిమితమైంది. మరో 10 చోట్ల అద్దె భవనాల్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో తరగతులను నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పాఠశాలల ప్రారంభంపై కచ్చితమైన తేదీ వెలువడనందున వారు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, ఈ పాఠశాలల్లో ఫర్నిచర్‌ కూడా ఇంకా సిద్ధం కాలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి.. ప్లాస్టిక్‌ కుర్చీలు తదితర కనీస సామగ్రిని పాఠశాలలే నేరుగా కొనుగోలు చేయటానికి వీలుగా ఒక్కో పాఠశాలకు రూ.లక్ష వంతున అదనంగా నిధులు కేటాయించినట్లు తెలిసింది. కిందటి విద్యా సంవత్సరమే ప్రారంభం కావల్సిన ఆదర్శపాఠశాలలు ఇప్పటికీ అడ్డంకుల మధ్యలోనే కొట్టుమిట్టాడుతున్నాయంటే దానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని ఒక ఎమ్మెల్సీ విమర్శించారు.
ఆదిలోనే ఇన్‌ఛార్జిల వ్యవస్థ: పలుప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఇన్‌ఛార్జిల పాలనతో ప్రారంభం అవుతుండడం గమనార్హం. 355 పాఠశాలలకుగాను 207 మందిని మాత్రమే ప్రధాన అధ్యాపకులను ఎంపిక చేశారు. మిగిలిన చోట్ల పీజీటీల్లో సీనియర్లను ఇన్‌ఛార్జి ప్రధాన అధ్యాపకులుగా నియమించబోతున్నారు. ప్రధాన అధ్యాపకుల నియామకాల్లో భాగంగా పేర్కొన్న సీనియార్టీ వంటి కొన్ని షరతుల వల్ల అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేసి మెరిట్‌ లిస్టులో ఉన్న అర్హులైన వారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు, పీజీటీ నియామకాల్లో తొలివిడత కౌన్సెలింగ్‌ ద్వారా కొందర్ని మాత్రమే నియమించబోతున్నారు. ప్రతి పాఠశాలలో తెలుగు, ఆంగ్లం, గణితం పోస్టుల్లో ఇద్దరేసి వంతున నియమించాల్సి ఉంది. కానీ ఒక్కొక్కర్నే నియమిస్తున్నారు. దీనివల్ల సీనియార్టీపరంగా నష్టపోతామని ఆ సబ్జెక్టుల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 9, 10 తరగతులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని, వారి సేవలు అప్పుడే అవసరమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పీజీటీ అభ్యర్థులకు జూన్ 17నాటికి పోస్టింగు ఆర్డర్లను ఇవ్వనున్నారు. వీరు విధుల్లో చేరిన అనంతరమే టీజీటీ పోస్టులను భర్తీచేస్తామని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.