మోడల్ బడి అనుమానమే:..ఆంధ్రజ్యోతి న్యూస్ చేవెళ్ల
ఈ విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్స్ ప్రారంభం అయ్యేలా
కనిపించటం లేదు. మరో పన్నెండ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
మోడల్ స్కూల్స్‌లో చేరేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
కొంతమంది విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాకు 19
మోడల్ స్కూల్స్ మంజూరయ్యాయి. వీటిలో ఈసారి 12 పాఠశాలలను ప్రారంభించాలని
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో చేవెళ్ల, మంచాల, యాచారం,
ఇబ్రహీంపట్నం, కందుకూర్, శంషాబాద్, గండీడ్, కులక్‌చర్ల, పూడూర్, మర్పల్లి,
బంట్వారం, నవాబుపేట మండలాల పాఠశాలలు ఉన్నాయి. మరో ఏడు పాఠశాలలను రానున్న
విద్యాసంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించింది. రెండేళ్ల నుంచి మోడల్
స్కూల్స్ ప్రారంభించాలని అనుకుంటున్నా... ఆచరణ సాధ్యం కావటం లేదు. గత ఏడాది
మోడల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలు వెలువడటంతో ఎంతో మంది
విద్యార్థులు దరకాస్తు చేసుకున్నారు. భవన నిర్మాణాలు పూర్తికాక పోవటంతో ఈ
ఏడాదికి వాయిదా పడింది. ఈ సారైనా ప్రారంభమవుతాయా? అంటే అదీ అనుమానమే.
మోడల్ స్కూల్స్ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో పాఠశాలలను
కొనసాగించాలని ఏర్పాట్లు చేసుకున్నా.. ఫలితం కనిపించలేదు. ఈ సారి మోడల్
స్కూల్స్‌లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. పాఠశాలలు
తెరిచే సమయం ఆసన్నమవుతున్నా... భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. ఎక్కడా
ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. కనీసం అద్దె భవనాలైనా వెతకలేదు. కానీ.. ఈనెల
20 నుంచి మోడల్ స్కూల్ కొనసాగించాలని భావించారు. చేవెళ్ల నియోజక వర్గంలో
ప్రభుత్వం చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, నవాబుపేట మండలాలకు
మోడల్ స్కూల్స్‌ను మంజూరు చేసింది. ఒక్కో మాడల్ స్కూల్‌కు రూ. మూడు కోట్ల
20 లక్షల నిధులు కేటాయించింది. 2011 జూన్ 18న చేవెళ్ల మండల కేంద్రంలో
అప్పటి మంత్రి సబితారెడ్డి మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
చేసింది. ప్రస్తుతం పనులు మూడడుగులు ముందుకు... ఏడడుగులు వెనక్కి..
సాగుతున్నాయి. నియోజకవర్గంలోని చేవెళ్ల నవాబుపేట మండలాల్లో ఈసారి
మోడల్‌స్కూల్స్ కొనసాగించాలని నిర్ణయిం తీసుకున్నారు. మొయినాబాద్,
శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో మోడల్‌స్కూల్స్‌కు బ్రేక్ పడింది. షాబాద్
మండలంలో పాఠశాల నిర్మాణం కోసం ఆది నుంచి చిక్కులే ఎదురయ్యాయి. రెండు చోట్ల
స్థల సేకరణ చేసి పనులు చేపట్టే సమయానికి స్థల వివాదం నెలకొంది. మొదట
కుమ్మరిగూడ శివారులో నిర్మించేందుకు ఏర్పాట్లు చేయగా కుదరలేదు. దీంతో
భువనగిరిపల్లి స్టేజీ సమీపంలో ఆర్నెళ్ల క్రితం పనులు ప్రారంభించారు.
మండలంలో స్కూల్ నిర్మాణ పనులు ప్లింత్ భీమ్‌ల వరకే పరిమితమయ్యాయి. అదే
విధంగా శంకర్‌పల్లిలో పుట్టింగ్ స్జేజిలోనే ఉన్నాయి. మొయినాబాద్ మండలంలో
అసలు పనులే ప్రారంభించలేదు. మండలంలో మోడల్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న
విషయంపై రాజకీయ గ్రహణం పట్టింది. మొయినాబాద్‌లో నిర్మించాలని మాజీ మంత్రి
సబితారెడ్డి పట్టుపట్టగా.. ఎమ్మెల్యే కేఎస్ రత్నం తన గ్రామమైన
కేతిరెడ్డిపల్లిలో నిర్మించాలని పట్టుబట్టారు. దీంతో ఇప్పటి వరకు పాఠశాల
నిర్మాణం కోసం కనీసం స్థల సేకరణ కూడా జరగలేదు. నిధులు మంజూరైనా ఇంకా
నిర్మాణం జోలికే వెళ్లలేదు. నవాబుపేట మండలంలో పనులు నత్తనడకగా
కొనసాగుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేశారు. సరిగ్గా క్యూరింగ్
చేయటం లేదు. ప్రస్తుతం స్లాబ్ దశలోనే పనులు సాగుతున్నాయి. ఇంచుమించూ మోడల్
స్కూల్ భవన నిర్మాణాల పరిస్థితి జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
ఈసారి పాఠశాలలను కొనసాగించేనా.. లేక వచ్చే విద్యాసంవత్సరం కొనసాగించేనా అనే
విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఒక్కో తరగతిలో 80 మంది చొప్పున అడ్మిషన్
చేసుకోనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. లాటరీ సిస్టమ్ ద్వారా
విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా
మండలాల్లో చదువకునే వారు మాత్రమే మోడల్ స్కూల్లో ప్రవేశానికి అర్హులు. వంద
మంది నిరుపేద విద్యార్థినులకు మోడల్ స్కూల్లో హాస్టల్ వసతి
కల్పించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో
మంజూరు చేసిన మోడల్ స్కూల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి పిల్లలకు
న్యాయం చేయాలని నియోజక వర్గ ప్రజలు కోరుతున్నారు.
ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..
చేవెళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న మోడల్‌స్కూల్‌లో
ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల
విద్యాధికారి శ్రీశైలం తెలిపారు. 6, 7, 8వ తరగతులతో పాటు ఇంటర్ మొదటి
సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. 6, 7, 8వ తరగతుల్లో
80 సీట్లు, ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్సులు 20, బైపీసీలో 20, సీఈసీలో 20,
మొత్తం 80 సీట్లు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. స్థానికులకు ప్రాధాన్యం
ఇస్తున్నుట్లు చెప్పారు. 6, 7, 8వ తరగతుల్లో చేరేందుకు లాటరీ పద్ధతిన,
ఇంటర్‌లో ప్రవేశానికి పదో తరగతిలో సాధించిన గ్రేడ్ విధానాన్ని పరిగణంలోకి
తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రవేశం కోరగోరు వారు మండల
విద్యావనరుల కేంద్రంలో జిరాక్స్ ఫారాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
వివరాల కోసం 9010333105 సంప్రదించాలన్నారు.