'ఆదర్శ'కు ఆదిలోనే అడ్డంకులు
ప్రజాశక్తి - కల్వకుర్తి
Thu, 5 Jul 2012, IST
-
-
ఈ విద్యా సంవత్సరం ప్రారంభించలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం
-
ఆందోళనలో విద్యార్థులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆర్భాటంగా
ప్రవేశపెట్టిన 'ఆదర్శ' పాఠశాలలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. 2012
విద్యా సంవత్సరంలో మొదటి విడత పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఇందు కోసం అధికారులు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి
దరకాస్తులు స్వీకరించారు. తీరా వచ్చే సరికి ఈ విద్యా సంవత్సరం మోడల్
విద్యాలయాలను ప్రారంభించలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి
చేతులెత్తేసింది. పాఠశాలలో చదివేందుకు ఎంతో ఆశతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
చేసుకున్న విద్యార్థులకు చివరకు నిరాశ మిగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో
ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి
శాఖ దేశ వ్యాప్తంగా నాలుగు వేల ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఇందుకు
గాను కేంద్ర ప్రభుత్వం 80 శాతం వాట, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం వాట
కేటాయించాల్సి ఉంది. మొదటి విడత ప్రారంభం కానున్న పాఠశాలలకు కేంద్రం నిధులు
మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మంజూరు చేయలేదు. కల్వకుర్తి
నియోజకవర్గంలో ఆదర్శ పాఠశాలల భవనాల నిర్మాణం నత్తనడకన కొనసాగుతుంది. ఏడాది
కిందటే పాఠశాల నిర్మాణాలకు పునాదుల వరకు పనులు చేపట్టి వదిలేశారు. ఈ విద్యా
సంవత్సరం ఎలాగైన ప్రారంభించాలనే ఉద్దేశంతో మాధ్యమిక విద్యాశాఖ అధికారులు
అద్దె భవనాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో
వారు చివరకు చేతులెత్తేశారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో ఇంగ్లీష్ మీడియం
విద్యను అందించడానికి ప్రభుత్వం ఈ పాఠశాలలను ప్రవేశపెట్టింది. 6వ తరగతి
నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంగ్లీష్ మీడియం
ఉపాధ్యాయులను సైతం ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొదటి విడత 355 ఆదర్శ
పాఠశాలలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని హంగులతో భవనాలు
నిర్మించేందుకు ఒక్కొ భవనానికి రూ. 3కోట్లా 2లక్షలు కేటాయించారు. జిల్లాకు
మొదటి విడతగా 7 ఆదర్శ పాఠశాలలు మంజూరు అయ్యాయి. అన్నిచోట్ల భవన నిర్మాణాలు
వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
కల్వకుర్తి నియోజకవర్గంలోని
వెల్దండ మండల కేంద్రానికి ఆదర్శ పాఠశాల మంజూరు అయ్యింది. భవన నిర్మాణం
పునాదులకే పరిమితమైంది. ఈ పాఠశాలలో అడ్మిషన్ల కోసం మండలానికి చెందిన దాదాపు
400 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. విద్యా
సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం
అందపోవడంతో విద్యార్థులు తలో దారీ చూసుకున్నారు. ఇదే తరహాలో జిల్లాలోని 7
ఆదర్శ పాఠశాలలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెల్దండతో
పాటు ధన్వాడ, పెబ్బేర్, కొత్తకోట, కోస్గి, కోడేరు, ఖిల్లగన్‌పూర్
మండలాలలో భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం
ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు దారీ తీసింది. అధికారుల నిర్లక్ష్యంగా
కారణంగానే ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభం కాలేదన్న విమర్శలు వ్యక్తం
అవుతున్నాయి.
No comments:
Post a Comment